ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం ఇంగ్లిష్ లో ‘క్రోని కేపిటలిజం’ అన్న మాటగా ఇటీవల చాలా ప్రాచూర్యం వచ్చింది. దాని సందర్భం తెలియక తికమక పడటం అందరికి విదితమే. దీన్ని ఒక ప్రత్యేక సందర్భంగా కాకుండా పెట్టుబడిదారీ విధానంలో భాగంగా అర్థం చేసుకొంటే ఏ గందరగోళం ఉండదు. అందుకే ఈ పెట్టుబడిదారీ విధానం ఎలా వచ్చిందో అందరం తెలుసుకుందాం. భారతదేశంలో ఈ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం ఎప్పుడు ప్రవేశించింది, దాని పర్యవసానాలు ఏమిటి అన్నది కూడా పరీశీలిద్దాం.
ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం 1997 తరువాత బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. దానికి కారణం ఆగ్నేయ ఆసియా దేశాలైన ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, దక్షిణ కొరియా, థాయ్ లాండ్ వంటి దేశంలో 1997లో వచ్చిన ఆర్థిక సంక్షోభాన్ని వివరించటానికి ఆర్థికశాస్త్రవేత్తలు ‘క్రోని కేపిటలిజం’ అన్న మాటను ఉపయోగించారు. ఈ దేశాల్లో వచ్చిన ఆర్థిక సంక్షోభం, పెట్టుబడిదారీ సంక్షోభం కాదని, ఈ దేశాలల్లో వుండే ప్రభుత్వాలు కొద్ది మంది చేతుల్లో బందీగా ఉంటూ తమ బంధువులకు, ఆశ్రితులకు కావలసిన విధంగా లావాదేవీలు జరపడంతో ఇక్కడ విపత్కరమైన సంక్షోభం వచ్చింది.